రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్ క్రాస్ ఎన్నికల్లో వివాదం… డా. గుడూరి రవీందర్ నామినేషన్ తిరస్కరించాలని ఫిర్యాదు

సిరిసిల్ల ముచ్చట్లు, సిరిసిల్ల:సిరిసిల్ల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పదవికి జరుగుతున్న ఎన్నికల్లో వివాదం చెలరేగింది. డా. గుడూరి రవీందర్ నామినేషన్ ను తిరస్కరించాలని కోరుతూ ఎన్నికల అధికారికి ఫిర్యాదు అందింది.
రెడ్ క్రాస్ సొసైటీ మాజీ డైరెక్టర్ బియ్యంకార్ శ్రీనివాస్ ఈ ఫిర్యాదు చేశారు. తన లేఖలో పలు తీవ్ర ఆరోపణలు చేశారు.
డా. రవీందర్ ప్రస్తుతం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ గా పనిచేస్తూ హెచ్ఆర్ఏ పొందుతున్నారు. నిబంధనల ప్రకారం వేరే జిల్లా అయిన సిరిసిల్లలో (80 కి.మీ దూరం) సేవలు అందించాలంటే ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి. కానీ ఎలాంటి అనుమతి లేకుండానే నామినేషన్ వేశారని ఆరోపించారు.
ప్రభుత్వ విధుల్లో ఉంటూనే సిరిసిల్ల పట్టణంలో భార్య పేరిట అమ్మ మల్టీ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ అనే ప్రైవేట్ ఆసుపత్రులను అక్రమంగా నిర్వహిస్తున్నారని, ప్రభుత్వ డ్యూటీ ఎగ్గొట్టి అక్కడ పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
అటెండెన్స్ రిజిస్టర్ లో కరీంనగర్ కు చెందిన వ్యక్తి ద్వారా వారం రోజుల సంతకాలు ఒకేసారి పెట్టిస్తున్నారని, గత మూడు నెలల ప్రైవేట్ ఆసుపత్రుల రికార్డులు, సెల్ ఫోన్ సిగ్నల్ ట్రేసింగ్ పరిశీలిస్తే అక్రమాలు బయటపడతాయని తెలిపారు.
గతంలో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే సమయంలో ఆపరేషన్ థియేటర్లో డా. ఇబ్రహీం తో గొడవపడి రోగిని మధ్యలోనే వదిలేశారని, దీంతో ఇద్దరినీ 5 నెలల పాటు సస్పెండ్ చేశారని గుర్తు చేశారు.
ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తికి రెడ్ క్రాస్ వంటి పవిత్ర సేవా సంస్థలో స్థానం కల్పించకూడదని, నామినేషన్ ను తిరస్కరించి అనర్హుడిగా ప్రకటించాలని ఫిర్యాదులో కోరారు.