ఎల్ నినో ఎఫెక్ట్… ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం : కలెక్టర్ గరిమ అగర్వాల్

సిరిసిల్ల ముచ్చట్లు, రాజన్న సిరిసిల్ల: ఎల్ నినో ప్రభావంతో ఏర్పడే వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పక్కా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు.
శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల, భూగర్భ జలాలు, విద్యుత్, మిషన్ భగీరథ, గ్రామీణాభివృద్ధి తదితర శాఖల అధికారులతో ఎల్ నినో ప్రభావం, ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపకల్పనపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు తగ్గడం, భూగర్భ జలాల లభ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలు, వ్యవసాయ శాఖ సూచనల మేరకు రైతులు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. నీటి లభ్యతకు అనుగుణంగా కూరగాయలు, పప్పుదినుసులు, ఆయిల్‌పామ్ తదితర ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. మండలాల వారీగా నీటి వనరుల లభ్యతను అంచనా వేసి, అందుకు అనుగుణంగా పంటల సాగు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
తెలంగాణ జలసిరి పనులు వేగవంతం
గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ జలసిరి పథకం కింద బోర్‌వెల్ రీఛార్జి గుంతలు, ఫామ్ పాండ్లు, మ్యాజిక్ సోక్ పిట్ల నిర్మాణ పనులను నిర్దేశిత లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని ఆదేశించారు. వీబీజీ రామ్ జీ పథకం కింద ఉపాధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు.
తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి
మిషన్ భగీరథ అధికారులు వేసవిలో తలెత్తే నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని, అవసరమైన యంత్రాలు, ఇతర ఏర్పాట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలకు అవసరమైన నీటిని సక్రమంగా సరఫరా చేయడంతోపాటు నీటి వృథాను అరికట్టాలని ఆదేశించారు.
పశువులకు గడ్డి, నీటి వసతి కల్పించాలి
పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు అవసరమైన పచ్చిగడ్డి, నీటి తొట్టెల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గ్రామపంచాయతీల్లో నీటి తొట్టెల మరమ్మతులు, నిర్వహణపై సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, ముఖ్య ప్రణాళిక అధికారి సంపత్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, లోకేష్, డీపీఓ వీర భద్రయ్య, ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.