పేదల స్వయం ఉపాధికి బాసట – సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పండ్ల బండ్ల వితరణ

సిరిసిల్ల ముచ్చట్లు, రాజన్న సిరిసిల్ల: సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలు, నిరుద్యోగ యువత, మహిళలు, వృద్ధులకు విద్య, వైద్యం, ఆర్థిక సహాయం అందించడమే పరమావధిగా సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి కృషి చేస్తోందని ప్రముఖులు పేర్కొన్నారు.
సిరిసిల్లలో సమితి సేవా కార్యక్రమాల్లో భాగంగా జీవనోపాధి కోసం ఇబ్బందులు పడుతున్న రాజు, రమణారెడ్డి అనే ఇద్దరు పేదలకు స్వయం ఉపాధి కల్పించేందుకు అరటి పండ్ల బండ్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వైశ్య భవన్ అధ్యక్షుడు కటకం సత్తయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడెపు రవీందర్ మాట్లాడుతూ సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, కష్టాల్లో ఉన్న తోటి వారికి అండగా నిలవడం గొప్ప విషయమని కొనియాడారు. పేదలకు స్వయం ఉపాధి కల్పించిన నిర్వాహకుల చొరవను అభినందించారు.
ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు మెరుగు సత్యనారాయణ, వీహెచ్‌పీ పట్టణ కార్యదర్శి గుంటుక పురుషోత్తం, భాజపా నాయకులు నాగుల శ్రీనివాస్, మామిడాల కృష్ణ, సమితి అధ్యక్షుడు బద్దేపురి దేవేందర్, ప్రధాన కార్యదర్శి శ్రీపతి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు సిరిమల్లె శ్రీహరి, ఆర్గనైజింగ్ సెక్రటరీ బూర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.