స్వయం ఉపాధి పొందుతూ, ఆర్థికంగా ఎదగాలి

SM-Sircilla news:జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో అందజేసిన కుట్టు మిషన్లను మహిళలు సద్వినియోగం చేసుకొని.. ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి టెక్స్టైల్ పార్కులో జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన మహిళలకు కుట్టు శిక్షణ కొనసాగుతుండగా, జిల్లా కలెక్టర్ సోమవారం పరిశీలించారు. కుట్టు శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని రోజులుగా శిక్షణ పొందుతున్నారు? శిక్షణలో ఏ ఏ మెలుకువలు అందిస్తున్నారు అనే అంశాలపై ఆరా తీశారు. వారిలో నిరుపేదలకు కుట్టు మిషన్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన రామిడి లక్ష్మి, బత్తిని అశ్విని, పోతూరి లావణ్య, దొరగళ్ల ప్రేమలత, పోతూరి నిర్మల, మంద సుమలతకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం కుట్టు మిషన్లను జిల్లా కలెక్టర్ అందజేశారు. అనంతరం కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ… కుట్టు మిషన్లను మహిళలు సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొందాలని సూచించారు. ఇటీవల చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో అందించిన శిక్షణలో మెలకువలు వినియోగిస్తూ, యూనిఫాంలు, ఇతర డ్రెస్సులు, ఆధునిక డిజైన్లతో డ్రెస్సులు కుట్టాలని పేర్కొన్నారు. ఆర్థికంగా రాణించి మిగతా వారికి ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ఏడీ సంతోష్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్ తదితరులు పాల్గొన్నారు.